హోదా, హామీల అమలు కాంగ్రెస్‌కే సాధ్యం
Published: Wednesday February 20, 2019

‘‘విభజన సమయంలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ నవ్యాంధ్రకు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు ఇవ్వాలని పట్టుబట్టింది. అధికారంలోకి వచ్చిన తరువాత హామీల అమలును విస్మరించింది. సాక్షాత్తు అప్పటి ప్రధాని ఇచ్చిన హామీలను సైతం బీజేపీ అమలు చేయకుండా ఆంధ్రప్రదేశ్‌ను పూర్తిగా కష్టాల్లోకి నెట్టింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు చేయడం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుంది’’ అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ ఊమెన్ చాందీ పేర్కొన్నారు. మంగళవారం అనంతపురం జిల్లా నీలకంఠాపురం గ్రామంలో ప్రత్యేక హోదా భరోసా యాత్రను ప్రారంభించారు. పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర్, మంత్రి డీకే శివకుమార్, కాంగ్రెస్ నేతలు పళ్లంరాజు, కనుమూరి బాపిరాజు, కేవీపీ రామచంద్రరావు, తులసిరెడ్డి, శైలజానాథ్ తదితరులతో కలిసి ఆయన యాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
మడకశిర పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఊమెన్‌చాందీ మాట్లాడారు. ‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వగలిగే శక్తి రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీకే ఉంది. ఇటీవల కర్నూలు జిల్లాలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ స్పష్టమైన హామీ ఇచ్చారు. తొలిసంతకం ప్రత్యేక హోదాపైనే అని భరోసా ఇచ్చారు’’ అని ఊమెన్ తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ, అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడమే కాంగ్రెస్ లక్ష్యమని అన్నారు. కర్ణాటక రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డాక్టర్ పరమేశ్వర్ మాట్లాడుతూ, ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రాంతీయ పార్టీలతో సాధ్యం కాదు. కేవలం జాతీయ పార్టీ కాంగ్రె్‌సతోనే సాధ్యం’ అని అన్నారు. మంత్రి డీకే శివకుమార్ మాట్లాడుతూ, ‘వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎవరి సొత్తూ కాదు. కాంగ్రెస్ పార్టీ ఆస్తి. దేశంలో ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుంది’’ అని స్పష్టం చేశారు.
