పౌరసరఫరాల కార్పొరేషన్‌కు కష్టాలు
Published: Monday February 18, 2019

రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్‌ను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సకాలంలో రాయితీలు అందక, ఇటు అవసరమైన స్థాయిలో రుణ సమీకరణ చేసుకోలేక తిప్పలు పడుతోంది. నిధులు ఇవ్వలేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం దానికి బదులుగా రుణ సమీకరణకు గ్యారెంటీ ఇస్తోంది. కానీ గత మూడు నెలలుగా కేంద్ర ప్రభుత్వం నిధులు దాదాపు మొత్తంగా ఆపేయడంతో కష్టాలు పెరిగాయి. ఈ ప్రభావం ప్రజాపంపిణీ వ్యవస్థపై పడకుండా చూడటం తలకు మించిన భారంగా మారింది. రాష్ట్రంలో 1.47కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో ఉన్న దాదాపు 4.20కోట్ల మందికి ప్రభుత్వం ప్రతినెలా 5కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తోంది.
ఒక్కో కిలోపై కేంద్రం రూ.27, రాష్ట్రం రూ.3 భారం భరిస్తున్నాయి. అయితే ఈ మొత్తం కార్డుల్లో జాతీయ ఆహార భద్రత చట్టం కింద గుర్తించినవి 91.93లక్షలు మాత్రమే. వాటిలోని సభ్యులకు మాత్రమే కేంద్రం తన వాటా నిధులు ఇస్తుంది. మిగిలిన భారం రాష్ట్ర ప్రభుత్వంపైనే పడుతోంది. కాగా, రాయితీ కింద కేంద్రం వాటాగా నెలకు రూ.750కోట్లు ఇవ్వాల్సి ఉంది. అయితే గత మూడునెలల్లో కేవలం రూ.200కోట్లు మాత్రమే ఇచ్చిందని, ఇంకా రూ.2,020కోట్లు బకాయిలు ఉన్నట్లు కార్పొరేషన్ తేల్చింది. రాష్ర్టాలకు నిధుల విషయంలో కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ చేతులెత్తేస్తోంది. కొత్తగా ప్రకటించిన పథకాలకు ఆర్థిక అవసరాల నేపథ్యంలో ఇతర పథకాలకు నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది. దీంతో కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలు, సాధారణ పథకాల రాయితీలపై ఈ ప్రభావం పడుతోంది.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రజాపంపిణీకి రాయితీ వాటా కింద ఏడాదికి రూ.3వేల కోట్ల వరకు ఇవ్వాల్సి ఉంటే, అందులో ఇంకా 2,500కోట్లు విడుదల కావాల్సి ఉంది. కాగా, ఇటీవల ప్రభుత్వ గ్యారెంటీపై రూ.5వేల కోట్ల రుణ సమీకరణకు కార్పొరేషన్‌కు అనుమతి మంజూరు చేసింది. కానీ ఆ నిధులు రావాలన్నా ఇంకా కనీసం నెల పడుతుందని అధికారులు చెబుతున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన రాయితీలు ఎప్పుడు ఇస్తారో అర్థంకాని పరిస్థితి ఏర్పడిందని రాష్ట్ర అధికారులు అంటున్నారు. ఎన్నికల వరకూ ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజాపంపిణీ వ్యవస్థ తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
