కేంద్రం వైఖరికి నిరసనగా ధర్నాలు
Published: Wednesday February 13, 2019

బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు న్యాయవాదులు రోడ్డెక్కారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బెజవాడ బార్ అసోసియేషన్, ఏపీ బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడలో ధర్నాలు చేశారు. సివిల్ కోర్టు సమీపంలో మానవహారం నిర్వహించారు.
న్యాయవాదులకు రూ.20లక్షల ఇన్సూరెన్స్, హెల్త్‌కార్డులు, వికలాంగ న్యాయవాదులకు పింఛను, కొత్తగా వృత్తిలోకొచ్చిన వారికి నెలనెలా రూ.10 వేల స్టైఫండ్, అడ్వకేట్ ప్రొటెక్షన్ చట్టం ఏర్పాటు, ఇళ్ల మంజూరు వంటివి వెంటనే అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అనంతరం, న్యాయవాదులంతా సివిల్ కోర్టు వద్ద నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి వినతిపత్రం సమర్పించారు. బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొండపల్లి సత్యనారాయణరావ్, ప్రధాన కార్యదర్శి దొడ్డా లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఏపీ బార్ కౌన్సిల్ అధ్యక్షుడు గంటా రామారావు నేతృత్వంలోని పలువురు న్యాయవాదులు హైకోర్టు సమీపంలో ధర్నా నిర్వహించారు.
