షుగర్, బీపీ రోగులకు ఫ్రీగా మందులు
Published: Monday February 11, 2019

మధుమేహం, అధిక రక్తపోటు వ్యాధులతో బాధపడే రోగులకు శుభవార్త. ఇకపై రోగులు ప్రైవేటు మందుల దుకాణాల్లో బీపీ, షుగర్ ట్యాబ్లెట్లు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఉచిత మందుల పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు.. ఈ పథకం కింద నెలకు సరిపడా మందులు ఒకేసారి పొందవచ్చు. రాష్ట్రంలో ఏ ప్రైవేటు రిటైల్ మెడికల్ షాపుల్లోనైనా రోగులు ఈ మందులు పొందే వెసులుబాటు కల్పించారు. బీపీ, షుగర్ రోగులపై ఆర్థిక భారం పడకుండా సంరక్షించేందుకు ప్రభుత్వం ఈ కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఇటీవల ఐసీఎంఆర్, కలామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ టెక్నాలజీ సంయుక్తంగా ఏపీలో సర్వే నిర్వహించాయి. నెలకు రూ.వేలు వెచ్చించి బీపీ, షుగర్ మందులు కొనుగోలు చేసే రోగుల కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతున్నట్లు గుర్తించారు. వారికి ఉచితంగా మందులు ఇవ్వడం ద్వారా ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని సిఫార్సు చేశారు. ఈ ప్రతిపాదనను రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ప్రభుత్వానికి పంపగా, ఆమోదం లభించింది.
పథకంలో చేరిక ఇలా...
ఉచిత మందుల పథకంలో లబ్ధిదారులుగా చేరదలచిన రోగులు తొలుత తమకు ఉన్న బీపీ, షుగర్ వ్యాధులను సమీపంలో ఉన్న ప్రభుత్వాస్పత్రుల్లో నిర్ధారణ చేయించుకోవాలి. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లు, ప్రాంతీయ ఆసుపత్రులు, జిల్లా కేంద్ర ఆసుపత్రి, ప్రభుత్వ వైద్య బోధన ఆసుపత్రుల్లో డాక్టర్లు ఈ జబ్బులను నిర్ధారించాలి. ముఖ్యమంత్రి ఆరోగ్యకేంద్రాలు (ఈ-యూహెచ్‌సీలు), ఎన్టీఆర్ వైద్య సేవ పథకం నెట్‌వర్క్ ఆసుపత్రుల వైద్యులు కూడా ఈ వ్యాధులను నిర్ధారించవచ్చు. బీపీ పరీక్షలతో పాటు గ్లైకోజినేటెడ్ హీమోగ్లోబిన్ పరీక్షలు (షుగర్‌కు) చేయించుకోవాలి. షుగర్ రోగులు ఫాస్టింగ్, పోస్ట్ ప్రాండియల్ పరీక్షలతో వ్యాధిని నిర్ధారించాలి. అనంతరం డాక్టర్ రోగి పరీక్ష ఫలితాలను AP-eRX APP ద్వారా అప్‌లోడ్ చేస్తారు. వెంటనే రోగి సెల్‌ఫోన్ నెంబర్‌కు ఎస్‌ఎంఎస్, కోడ్ వస్తుంది. అంతే రోగి లబ్ధిదారుడుగా ఎంపికైనట్లే. ఈ కోడ్‌ను చూపి రిటైల్ మెడికల్ షాపునకు వెళ్లి మందులు కొనుగోలు చేసుకోవచ్చు. ఒకసారి నెలకు సరిపడా మందులు ఇస్తారు. రోగులను ఈ పథకంలో లబ్ధిదారులుగా చేర్చేందుకు వారి ఆధార్ నెంబర్, ప్రజాసాధికార సర్వే వివరాలను అనుసంధానం చేస్తారు. ప్రజా సాధికార సర్వేలో నమోదు కానివారు తమ సమీపంలో ఉన్న మీ సేవ కేంద్రంలో సంప్రదించాలి.
