‘సర్వే’లో పదోన్నతులకు బేరం

Published: Sunday February 03, 2019
 సర్వే శాఖలో వసూళ్ల పర్వానికి తెరలేచింది. ఉద్యోగులకు న్యాయబద్ధంగా దక్కాల్సిన పదోన్నతులకు బేరసారాలు జరుగుతున్నాయి. రూ.15లక్షలు ఇచ్చినవారికే ప్రమోషన్‌ అంటూ ఓ అధికారి అడ్డంగా దోచుకుంటున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. రెగ్యులర్‌ అధికారులతో పాటు రిజర్వేషన్‌ కోటాలోని ఎస్సీ, ఎస్టీ అధికారుల పదోన్నతులు సైతం బేరంతో ముడిపెట్టారని చెబుతున్నారు. బేరసారాలకు ప్రకాశం జిల్లాకు చెందిన ఓ సూపరింటెండెంట్‌ను నియమించడం, అతను వీరంగం చేస్తుండటంతో బేరం రచ్చకెక్కింది. అడ్వాన్సుల కింద లక్షలాది రూపాయలు చెల్లించినవారు డబ్బు తిరిగివ్వాలని పట్టుబడుతున్నారు. దీంతో వీరిమధ్య సయోధ్య కుదురిచ్చేందుకు మరో సీనియర్‌ అధికారి కొత్తరకం సెటిల్‌మెంట్‌ ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. అదీ వాట్సాప్‌ గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది.
 
సర్వే శాఖలో డిప్యూటీ సర్వేయర్‌, సర్వేయర్‌ కేటగిరీల్లో 25ఏళ్లుగా పదోన్నతులు లేకపోవడంతో ఉద్యోగులు నిరంతర పోరాటం చేస్తున్నారు. ఇక డిప్యూటీ సర్వే ఇన్‌స్పెక్టర్‌, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే కేటగిరీల్లోనూ పదేళ్లుగా పదోన్నతులు ఇవ్వడం లేదు. అంతా అదనపు బాధ్యతలు, పూర్తిస్థాయి అదనపు బాధ్యతల కింద పనులు నెట్టుకొస్తున్నారు. నిబంధనల ప్రకారం పదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వేకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పదోన్నతి కల్పించాలి. ఈ విభాగంలో 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికి శ్రీనివాసరెడ్డి, జలీల్‌ అహ్మద్‌, చంద్రానాయక్‌, ప్రసాదరావు, కనకప్రసాద్‌, నాగశేఖర్‌, వై. రామకృష్ణ, డి. గిరి, కేశవరావు ఎప్పుడో అర్హత సాధించారు. వీరికి ఏడీగా ప్రమోషన్‌ ఇస్తే డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వేగా ఉన్న ఐదుగురికి ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వేగా పదోన్నతి లభిస్తుంది. ఈ విభాగంలో ఏండీ సలీమ్‌, జి. సుధాకర్‌ నాయుడు, డీవీఎ్‌సఎన్‌ కిషోర్‌బాబు, ఈ. నాగప్పనాయక్‌, ఈ. రూపీనాయక్‌, డీవీ ప్రసాదరావు, కె. లక్ష్మీనారాయణ, కె. మురళీకృష్ణ ఏ. పుల్లయ్య అర్హత పొందారు.