కాంగ్రెస్ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించింది
Published: Thursday January 24, 2019

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన చెల్లెలు ప్రియాంక వాద్రా గాంధీని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. కీలకమైన తూర్పు ఉత్తరప్రదేశ్ వ్యవహారాల ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించారు. ప్రియాంకను తురుపుముక్కగా దింపడం ద్వారా కాంగ్రెస్.. లోక్‌సభ క్షేత్రాన్ని రసవత్తర రణాంగంగా ఒక్కసారిగా మార్చేసింది. ప్రియాంక శకం కాంగ్రెస్ లో ఆరంభమైనట్లే! వంశపాలనకే ఎక్కువగా మొగ్గుచూపే కాంగ్రెస్ నాయకశ్రేణి ఊహించినట్లే ఆమె రాకను సహర్షంగా స్వాగతించింది. ఆమె రాక నిజంగా గేమ్ ఛేంజర్ అవుతుందని ప్రచారం మొదలెట్టింది. ‘ప్రియాంక రావాలి, ఆమే రావాలి’... రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ కార్యకర్తలు పదేపదే చేసిన నినాదమిది! ఇన్నాళ్లూ ఆమె- సోనియా, రాహుల్‌గాంధీల నియోజకవర్గాలైన రాయ్‌బరేలీ, అమేఠీలకు మాత్రమే పరిమితమై- వారి తరఫున ప్రచార బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. ఇపుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు.
కాంగ్రెస్ అధ్యక్షుడైన రాహుల్ ఆమెను నేరుగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ- రాజకీయంగా అత్యంత కీలకమైన తూర్పు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించారు. సొంత నియోజకవర్గం అమేఠీలో ఓ ర్యాలీలో ఆయన స్వయంగా ప్రియాంక ప్రత్యక్ష రంగ ప్రవేశాన్ని ప్రకటించడం విశేషం. ఆ తరువాత ఏఐసీసీ ఓ ప్రకటన విడుదల చేస్తూ సంస్థాగత నియామకాల్ని వివరించింది. ప్రియాంక నియామకం ద్వారా కాంగ్రెస్ ఒక్క బీజేపీకే కాక- మిత్రపక్షాలకూ, మిగిలిన విపక్షాలకూ గట్టి సంకేతాలు పంపింది. ప్రియాంక గాంధీ కోసం పార్టీ సంస్థాగతంగా కూడా ఓ పెద్ద మార్పు చేసింది. మొట్టమొదటిసారిగా యూపీని తూర్పు, పశ్చిమగా విభజించారు. తూర్పు యూపీ ఇన్‌చార్జిగా ప్రియాంకను నియమించగా... పశ్చిమ యూపీ ఇన్‌చార్జి బాధ్యతలను మధ్యప్రదేశ్‌కు చెందిన యువనేత జ్యోతిరాదిత్య సింధియాకు అప్పగించారు.
