బంగారంపై సర్‌చార్జి భారం - మంత్రి జైట్లీ బడ్జెట్

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: అమ్మాయి పెళ్లి అంటే.. కలిగినంతలో కాసో, రెండు కాసులో బంగారం పెడతారు పుట్టింటివారు! కొడుకు పెళ్లయితే.. కోడలికి నల్లపూసల గొలుసో, నాంతాడో పెట్టి మహాలక్ష్మిలా ఇంటికి తెచ్చుకుంటారు. అల్లుడికి వెండికంచం, చెంబు లాంటివి సరేసరి!! అవీ లేని నిరుపేదలు ఇమిటేషన్ నగలతో సరిపెట్టుకుంటారు. అయితే.. బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి జైట్లీ బంగారంపై సర్‌చార్జి భారం, మిగతావాటిపై కస్టమ్స్ భారం మోపారు. దిగుమతయ్యే రంగురాళ్లపై కస్టమ్స్ డ్యూటీని 2.5 శాతం నుంచి 5 శాతానికి.. వజ్రాలపై 2.5ు నుంచి 5 శాతానికి, గిల్టు నగలపై 15ు నుంచి 20 శాతానికి పెంచారు. బంగారంపై 3 శాతం సర్‌చార్జ్ వేశారు. ఈ ప్రభావం రానున్న పెళ్లిళ్ల సీజన్‌పై పడనుందని.. ఆభరణాల కొనుగోళ్లు తగ్గుతాయని, ముఖ్యంగా మధ్యతరగతివారు తమ ఆశలకు ఒకింత కళ్లెం వేసుకోవాల్సిందేనని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాగా, బంగారాన్ని ఆస్తిగా పరిగణించే దిశగా ఒక సమగ్రమైన పసిడి విధానాన్ని రూపొందించనున్నట్లు జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.
