పర్యాటకరంగ అభివృద్ధికి ప్రాధాన్యం

‘అటు అరకులో బెలూన్ల పండగ.. కోటప్పకొండలో కొండపండగ... ఇటు సూళ్లూరుపేటలో పక్షుల పండగ. రాష్ట్రంలో పర్యాటకరంగం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టితో చేస్తున్న కృషిలో భాగమే ఈ పండగలు’ అని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఆదివారం ఫ్లెమింగో ఫెస్టివల్(పక్షుల పండగ)ను ప్రారంభించారు. అంతకుముందు పశుసంవర్థకశాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలలో గోపూజ చేశారు. అనంతరం పండగ బెలూన్‌ను గాలిలోకి వదిలి 3 రోజుల పండగకు శ్రీకారం చుట్టారు. జిల్లా క్రీడా ప్రాథికారసంస్థ నిర్వహిస్తున్న క్రీడా పోటీలను ప్రారంభింపచేశారు. అనంతరం ప్రారంభోత్సవ సభలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉన్నా సంక్షేమ కార్యక్రమాల అమలులో సీఎం వెనుకడుగు వేయలేదన్నారు. 2014లో నెలకు రూ.60 కోట్లు పింఛన్లుగా ఇచ్చేవారని, తమ ప్రభుత్వం వచ్చాక రూ.600 కోట్లకు పెరిగిందన్నారు. మరో ఐదేళ్లలో నెలకు 70వేల కోట్లు పింఛన్లుగా పంపిణీ చేయాలన్న ఆలోచనలో సీఎం ఉన్నారని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న కృషిని చూసి కొందరికి నిద్రపట్టడం లేదని ఎద్దేవా చేశారు. అందుకే చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్నారన్నారు. విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన చిన్న సంఘటనకు నిన్న హైదరాబాదులో ఫిర్యాదు చేసి తన చీప్ మెంటాలిటీని బయటపెట్టుకున్నారని జగన్ పేరు ప్రస్తావించకుండా విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఫెస్టివల్ కమిటీ చైర్మన్ పరసారత్నం పాల్గొన్నారు.
