విశాఖలో భోగిమంటతో వినూత్న నిరసన

విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుపై కేంద్రం వైఖరిని ఆక్షేపిస్తూ నాన్ పొలిటికల్ జేఏసీ శుక్రవారం వినూత్న రీతిలో నిరసన వ్యక్తంచేసింది. వాల్తేర్ డీఆర్‌ఎం కార్యాలయం ఎదురుగా భోగి మంట వేసి.. జోన్‌కు సంబంధించి విభజన చట్టం 13వ షెడ్యూల్‌లో పేర్కొన్న అంశాల ప్రతులను దహనం చేసింది. తెలుగు ప్రజల గుండె మంట ప్రధాని మోదీకి తగిలేలా ఈ భోగి మంటలు వేశామని జేఏసీ ప్రతినిధులు ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల చిరకాల కోరిక.. రైల్వే జోన్ ఇస్తారని నాలుగున్నరేళ్లుగా ఎదురుచూశామన్నారు. ఈ నెల 9వ తేదీతో పార్లమెంట్ సమావేశాలు ముగించడంతో జోన్ ప్రస్తావన మరుగున పడినట్లయిందన్నారు. జోన్ తీసుకువస్తామని, లేకపోతే తమ ఓటమిగా భావించాలని విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు చెప్పారని, అయినా ఫలితం లేకపోయిందని ఆక్షేపించారు. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయకపోతే ఆ కాగితాలకు విలువ లేనందున భోగి మంటల్లో వేశామని మంత్రి చెప్పారు. విశాఖలో పాదయాత్ర చేసిన విపక్ష నేత జగన్, కనీసం జోన్ గురించి ప్రస్తావించలేదని విమర్శించారు.
