మార్పు కోసం రమేష్ జార్కిహొళి తీవ్ర యత్నం
Published: Friday January 11, 2019

రాష్ట్రంలో సంకీర్ణప్రభుత్వం ఏర్పడి ఏడునెలలు పూర్తయినా, ఇప్పటికీ దిన దిన గండం నూరేళ్ళు ఆయుష్షు అనేలా నడుస్తోంది. సర్కార్ ప్రారంభం నుంచి నిత్యం వివాదాలు విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. గత నెల మంత్రివర్గవిస్తరణ, బోర్డులు, కార్పొరేషన్‌లలో తలెత్తిన స్పర్దలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జేడీఎస్, కాంగ్రెస్ అసంతృప్తులను తమలో చేర్చుకునే యత్నాన్ని బీజేపీ తీవ్రతరం చేసినట్లు తెలుస్తోంది. ఆరు నెలలుగా కాంగ్రెస్ అసంతృప్తులు మాత్రమే బహిరంగ విమర్శలు చేశారు. తాజాగా జేడీఎస్ లోనూ అదే పరిస్థితి ఆరంభం కావడంతో బీజేపీ రెండు పార్టీల్లోనూ తన వ్యూహాలను అమలు చేయాలని నిర్ణయించుకొంది.
తాజాగా పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలకు సమావేశమైన సీఎం కుమారస్వామి తానో క్లర్క్‌గా మాత్రమే పనిచేస్తున్నానని, ఓ ముఖ్యమంత్రిలా కాదని ఎంతకాలం పదవిలో కొనసాగుతానో తెలియదంటూ చేసిన వ్యాఖ్యలు ఏకంగా కాంగ్రెస్, జేడీఎస్ అగ్రనేతల్లో భయం పుట్టుకొనేలా చేశాయి. ఇటువంటి వ్యాఖ్యలు గతంలోనూ చేసినా తాజాగా క్లర్క్ అంటూ విచారం వ్యక్తం చేయడం కాంగ్రెస్ మంత్రులు, నేతలకు చెంపపెట్టుగా మారింది. సొంతింటిని చక్కదిద్దుకొని ఎదుటివారిని ఆహ్వానించడానికి బీజేపీ సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కాంగ్రెస్, జేడీఎ్‌సలతో చేతులు కలుపరాదని ఎమ్మెల్యేలను అధిష్టానం హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎమ్మెల్యేలంతా ఢిల్లీకి రావాలని సూచించినట్లు తెలుస్తోంది. శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు జాతీయ పార్టీ సమావేశం ఢిల్లీలో సాగనుంది. ఆ తర్వాత ఆదివారం రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యేతో ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాలు ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ లోగానే ఎమ్మెల్యేలతో అమిత్ షా ప్రత్యేక సమావేశం జరుపనున్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఢిల్లీలో జరిగే కీలక భేటీ తర్వాత రాష్ట్రంలో రాజకీయం వేడెక్కనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ అసంతృప్తు మాజీ మంత్రి రమేష్ జార్కిహొళి గుట్టు చప్పుడు కాకుండా తన ప్రయత్నాలను కొనసాగించడం బీజేపీకి మరింత బలంగా మారుతున్నట్లు తెలుస్తోంది.
