విడిభాగాలు మాయమై మిగులుతున్న ‘తుక్కు’
Published: Thursday January 10, 2019

అటవీశాఖ తిరుపతి వన్యప్రాణి విభాగం పరిధిలో ఎర్రచందనం దుంగలను రవాణా చేస్తుండగా పట్టుబడిన వాహనాలు ‘ఇంటిదొంగల’ చేతికి చిక్కి మూణ్ణాళ్లకే గుల్లవుతున్నాయి. పట్టుబడిన సమయంలో మంచి రన్నింగ్ కండిషన్‌లో ఉన్న వాహనాలు తీరా వేలంవేసే నాటికి తోసినా ముందుకు కదలని పరిస్థితికి చేరుకుంటున్నాయి. ఏఒక్క వాహనంలోనూ ఇంజన్లు పూర్వపు పరిస్థితిలో ఉండడం లేదు. పైకి అంతా బాగానే ఉన్నట్టు కనిపించినా లోపల విడిభాగాలు (స్పేర్‌పార్ట్స్) మాత్రం గల్లంతవుతున్నాయి.
పట్టుబడిన రోజునే విక్రయిస్తే రూ.3లక్షలు ధర పలికే వాహనమైనా వేలం నాటికి తుక్కులెక్కన అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇందుకు ప్రధాన కారణం ఉన్నతాధికారులు బాధ్యత చూపకపోవడమే. ఇంటిదొంగలు పట్టుబడిన వాహనాలలోని విడిభాగాలను ఇంటిదొంగలు మెకానిక్ షెడ్లకు తరలిస్తూ అక్రమార్జనకు తెర తీస్తున్నారు. విడిభాగాలను వేలల్లో విక్రయిస్తూ లక్షలు గడిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సంబంధిత ఉన్నతాధికారులు పట్టుబడిన వాహనాలకు సరైన సమయంలో వేలం నిర్వహించకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురవుతోంది. గతంలో ఇక్కడ పనిచేసిన డీఎఫ్‌వోలు వాహనం పట్టుబడిన రోజు నుంచి విక్రయించే వరకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి వాటిపై పర్యవేక్షణ చేయించేవారు. అప్పట్లో ఏ వాహనం నుంచి విడిభాగాలు పోయినా ఆ రోజు విధుల్లో ఉన్న సిబ్బందే బాధ్యత వహించాల్సి ఉండేది.
తిరుపతి, భాకరాపేట, బాలపల్లి రేంజ్‌ల పరిధిలో వందలాది పట్టుబడిన వాహనాలు డిపోల్లో మూలుతున్నాయి. వేలానికి నోచుకోక ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ తుపుపట్టే స్థితికి చేరాయి. వీటిలో కొన్ని మాత్రమే ఇంకా కండీషన్‌లో ఉండగా మిగిలినవి ‘స్ర్కాప్’ కింద కూడా అమ్ముకోలేని పరిస్థితికి చేరుకున్నాయి. ఇప్పుడు అటవీశాఖ అధికారులు వీటికి వేలం నిర్వహించినా ప్రభుత్వానికి పెద్దగా ఆదాయం వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికీ అధికారులు స్పందించకపోతే ప్రభుత్వం పూర్తిస్థాయిలో నష్టపోక తప్పదు.
ఎర్రచందనం అక్రమ రవాణాలో పట్టుబడిన వాహనాలకు త్వరలోనే వేలం నిర్వహిస్తాం. ఆయా వాహనదారుల నుంచి ఎలాంటి సమాచారం రాని పక్షంలో ట్రాన్స్‌పోర్ట్ అధికారులు నిర్ణయించే ధర ప్రకారం వేలం నిర్వహిస్తాం. ఇప్పటికే కొన్ని వాహనాలకు వేలం నిర్వహించాం.
