‘జగన్ అనే నేను... హామీ ఇస్తున్నా...’
Published: Monday December 31, 2018

‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ మద్దతు ప్రకటిస్తే... సీఎం చంద్రబాబు దానినీ రాజకీయం చేస్తున్నారు. పక్క రాష్ట్రం సీఎం స్పందించి ఏపీకి హోదా కోసం కేంద్రానికి లేఖ రాస్తానని చెబితే ఎవరైనా ఆనందించి స్వాగతిస్తారు. కేసీఆర్ మద్దతుతో మొత్తం 42 మంది ఎంపీలవుతారు. బలం దొరుకుతుంది. అయినా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు’’ అని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా పలాస బహిరంగ సభలో ప్రసంగించారు.
‘‘ఎన్నికలు సమీపిస్తున్నందున ఇన్నేళ్లు పట్టించుకోని కడప ఉక్కు పరిశ్రమకు ఆగమేగాలపై శంకుస్థాపనలు చేశారు. చుక్కనీరు కూడా పోలవరం ప్రాజెక్టులో లేకపోయినా గేట్లు బిగింపు పేరుతో హంగామా చేస్తున్నారు. రాజధానిలో ఐదేళ్లలో శాశ్వత భవనం ఒక్కటీ కట్టని ముఖ్యమంత్రి ఇప్పుడు రెండెకరాలలోని బొమ్మ భవనాలను చూపించడానికి బస్సులు వేస్తున్నారు. ఎప్పటినుంచో ఉన్న పాత సమస్యలను తానేదో కొత్తగా కనిపెట్టినట్లు పవన్ కల్యాణ్ ఆయా ప్రాంతాలకు వెళ్లి హడావుడి చేస్తారు. చంద్రబాబుకు ఎప్పుడు కష్టం వచ్చినా పవన్ రంగంలోకి దిగుతారు. వీరిద్దరూ పార్ట్‌నర్స్. వైసీపీ అధికారంలోకొస్తే ఉద్దానం కిడ్నీ బాధితులను పూర్తి స్థాయిలో ఆదుకుంటాం. కిడ్నీ బాధితులకు ఇస్తున్న రూ.2500 పింఛన్‌ను రూ.10 వేలకు, డయాలసిస్ చేయించుకుంటున్న రోగులకూ అంతే మొత్తంలో పింఛను పెంచుతాం’’ అని వాగ్దానంచేశారు. మహేష్ బాబు సినిమా డైలాగ్‌ను గుర్తు చేస్తూ... ‘‘జగన్ అనే నేను... మీ అందరికీ హామీ ఇస్తున్నా’’ అంటూ మాట్లాడారు.
