ఎండలో నగ్నంగా విద్యార్థులను నిలబెట్టడమేంటి
Published: Friday December 28, 2018

పాఠశాలకు ఆలస్యంగా వచ్చారని 9ఏళ్లలోపు వయస్సు గల ఆరుగురు చిన్నారులను బట్టలు లేకుండా టీచర్లు ఎండలో నిలబెట్టిన వుదంతం గురువారం సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే... పుంగనూరు ఎన్‌ఎస్ పేటలోని రాంనగర్ కాలనీలో రెడ్డిజన సంక్షేమభవన్‌ను అద్దెకు తీసుకుని చైతన్యభారతి ఇంగ్లీషు మీడియం ప్రాథమికోన్నత పాఠశాలను కరస్పాండెంట్ నాగరాజనాయుడు నిర్వహిస్తున్నారు. బుధవారం పాఠశాలలో 3, 4 తరగతులు చదివే సుహేబ్, భరత్, అఖిల్, ముజ్విర్, షాహెద్, హర్షద్ పాఠశాలకు ఆలస్యంగా వచ్చారు. వీరిని క్రమశిక్షణ పేరుతో ఉపాధ్యాయులు తరగతి గది బయట ఎండలో బట్టలు విప్పించి నిలబెట్టారు. ఈ విషయాన్ని ఎదురుగా ఉన్న గది నుంచి కొందరు సెల్‌ఫోన్‌లో వీడియో తీశారు. ఈ వీడియోను గురువారం ఉదయం పుంగనూరు డెవలప్‌మెంట్ ఫోరం సోషల్ మీడియాతో బాటు జిల్లా అధికారులకు పంపారు. పుంగనూరు ఎంఈవో లీలారాణి చైతన్యభారతి పాఠశాలకు వెళ్లి జరిగిన విషయంపై విద్యార్థులను, టీచర్లను ఆరా తీసి పిల్లల తల్లిదండ్రులను పిలిపించారు.
అప్పటికే కలెక్టర్ ప్రద్యుమ్న ఉపాధ్యాయుల దాష్టీకంపై ఆగ్రహం వ్యక్తం చేసి వెంటనే సమగ్ర విచారణ నిర్వహించి నివేదిక ఇవ్వాల్సిందిగా డీఈవో పాండురంగస్వామిని ఆదేశించారు. మదనపల్లె డీవైఈవో ముస్తఫాఅహ్మద్, ఎంఈవో లీలారాణి విచారించి విషయాన్ని కడప అర్జేడీ ప్రతాపరెడ్డి, డీఈవోలకు ఫోన్‌ద్వారా సమాచారం ఇచ్చారు. పిల్లలను ఎండలో నిలబెట్టిన సంఘటన వాస్తవమని తెలియగానే కలెక్టర్ ప్రద్యుమ్న చైతన్య భారతి పాఠశాల గుర్తింపును రద్దు చేసి పాఠశాల మూత వేయాలని డీఈవోను ఆదేశించారు. అప్పటికే పుంగనూరులో విద్యార్థి సంఘ నాయకులు, పీడీఎఫ్ నాయకులు, ప్రజాసంఘాలు స్థానిక ఎమ్మార్సీ కార్యాలయం ఎదుట బైపా్‌సరోడ్డులో ధర్నా చేశారు. చైతన్యభారతి పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని, ఎంఈవోపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసి రాకపోకలకు అంతరాయం కలిగిస్తుండడంతో ఎస్‌ఐలు గౌరీశంకర్, సహదేవి సంఘటనా స్థలానికి వెళ్లి ఆందోళనకారులకు నచ్చచెప్పి వారిపై కేసు నమోదు చేస్తున్నామని శాంతపరిచారు.
టీవీల ద్వారా ఈ విషయం తెలుసుకున్న హైదరాబాద్ బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావు న్యూఢిల్లీ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌లో అర్జెంట్ పిటీషన్ దాఖలు చేశారు.చైతన్యభారతి పాఠశాల కరస్పాండెంట్ నాగరాజ నాయుడిపై ఫోక్సో యాక్టు ప్రకారం కేసు నమోదు చేయాలని కోరారు.పాఠశాల యాజమాన్యంతో ఎంఈవో లీలారాణి లాలూచీ పడినట్లు తెలుస్తోందని ఆరోపించారు.కాగా పిల్లలను నగ్నంగా నిలబెట్టిన ఘటనపై పాఠశాల కరస్పాండెంట్ నాగరాజనాయుడు, హెచ్‌ఎం డి.భువనేశ్వరిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని పుంగనూరు సీఐ నాగశేఖర్‌కు ఎంఈవో లీలారాణి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వారిపై జునైయల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం ఐపీసీ సెక్షన్323 మేరకు కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేసి పుంగనూరు జడ్జి రమణారెడ్డి ఎదుట హాజరుపరచగా ఆయన రిమాండ్‌కు ఆదేశించడంతో మదనపల్లె సబ్‌జైలుకు తరలించారు. విద్యాశాఖ అధికారులు పాఠశాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి పాఠశాలకు తాళం వేయించారు. ఈ విషయంపై పాఠశాల కరస్పాండెంట్ నాగరాజనాయుడు మాట్లాడుతూ విద్యార్థులు పాఠాలు చదవకపోవడంతో ఎండలో నిలబెట్టామని, వాళ్లేమో ఎండలో నిలబడలేక శరీరంపై పురుగులు పడడంతో ఇబ్బందిగా ఉందని చెప్పడం వల్ల దుస్తులు విప్పి చూడగా ఏమీ లేకపోవడంతో విద్యార్థులను మందలించడం జరిగిందన్నారు.
విద్యార్థుల బట్టలు తీయించడం నేరమని తెలియదా అని ప్రశ్నించగా విద్యార్థులు చదవడానికి కొన్ని చర్యలు తప్పవని సమర్థించుకున్నారు. సీఐ నాగశేఖర్, ఎస్‌ఐ గౌరీశంకర్, పోలీ్‌ససిబ్బంది హుటాహుటిన పాఠశాల వద్దకు చేరుకుని అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం ఎస్‌ఎ్‌ఫఐ, ఏఎ్‌సఎ్‌ఫఐ నాయకులు పాఠశాలను మూసివేయాలంటూ ధర్నాకు దిగారు.ఈ విషయం తెలుసుకున్న సీఐ నాగశేఖర్ అక్కడకు చేరుకుని పాఠశాలలో విద్యార్థులను ఇళ్లకు పంపి స్కూలుకు తాళం వేయించారు. కాగా పాఠశాల నిర్వహణ విషయంలో కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు 120 మంది ఎల్‌కేజీ, యూకేజీల్లో 20 మంది విద్యార్థులు ఉన్నట్లు ఎంఈవో లీలారాణి చెబుతుండగా పాఠశాలలో 240 మంది విద్యార్థులు, 13 మంది టీచర్లు, 14 గదులు ఉన్నట్లు తెలుస్తోంది. అర్హతలేని ఉపాధ్యాయులతో పాఠశాల నడుస్తోందని, బస్సుల డ్రైవర్లుకు లైసెన్స్‌లు కూడా లేవంటూ స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు.
