ప్రజల ఆకాంక్షల మేరకే కేంద్ర బడ్జెట్ : ప్రధాని మోదీ

కేంద్ర బడ్జెట్ ప్రజల ఆకాంక్షల మేరకే ఉంటుందని ప్రధాని మోదీ చెప్పారు. సామాన్యుల అంచనాలకు తగ్గట్లుగానే ఉంటుందని తెలిపారు. భారత ఆర్థిక వృద్ధిని ప్రపంచం గుర్తిస్తోందన్నారు. అంతర్జాతీయ క్రెడిట్ రేటింగ్ సంస్థలు, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ వంటి సంస్థలు ఇప్పటికే దేశ ఆర్థిక వృద్ధిని గుర్తించాయని వెల్లడించారు. సోమవారం ఆయన పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ట్రిపుల్ తలాక్ బిల్లుపై రాజకీయాలు చేయొద్దని, ఇది అత్యంత ప్రధానమైన అంశమని మోదీ స్పష్టం చేశారు. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందేందుకు సహకరించాలని అన్ని రాజకీయ పార్టీలను అభ్యర్థించారు. ప్రస్తుత సమావేశాల్లోనైనా బిల్లును ఆమోదించి ముస్లిం మహిళలకు నూతన సంవత్సర కానుకగా ఇద్దామని అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. బిల్లు ఆమోదం పొందితే ముస్లిం మహిళలు స్వేచ్ఛగా, నిర్భయంగా జీవించే అవకాశం ఉంటుందన్నారు. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి కూడా ఈ బిల్లును ప్రస్తావించారు. ఇది అతిత్వరలోనే చట్టంగా రూపొందుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
