రేపటి నుంచే ‘అమరావతి యాత్రలు’?

సందర్శకులు తొలుత రాజధానిలోని ఉద్ధండరాయునిపాలెం చేరుకోవాలి. అక్కడ 2015, అక్టోబర్ 22న ప్రధాని మోదీ .. అమరావతి నిర్మాణం కోసం వేసిన శంకుస్థాపన ఫలకాల సందర్శనతో అమరావతి యాత్రలు ఆర్టీసీ బస్సుల్లో ప్రారంభమవుతాయి. అమరావతి మాస్టర్‌ప్లాన్‌ను చూపే 3 డి మ్యాప్‌ను సందర్శకులు చూస్తారు. ఈ మ్యాప్ ప్రకారం రాజధాని నిర్మాణంలోని విశేషాలను, ప్లానింగ్ విశిష్టతలను, ‘బ్లూ- గ్రీన్ కాన్సె్‌ప్ట’లో ఈ నగరాన్ని నిర్మించేందుకు జరుగుతున్న కృషిని, 9 థీమ్‌సిటీలు, 27 టౌన్‌షి్‌పలు, భారీ రహదారులు, ప్రపంచస్థాయి మౌలిక వసతులు, ఐకానిక్ నిర్మాణాలు ఇత్యాది అన్నింటి గురించి అధికారులు తెలియజేస్తారని సమాచారం.
అక్కడి నుంచి రాయపూడి, నేలపాడుల పరిధిలో ప్రజా ప్రతినిధులు మొదలుకుని అఖిల భారత సర్వీస్ (ఏఐఎస్) అధికారులు, గెజిటెడ్, ఎన్జీవోలు, 4వ తరగతి ఉద్యోగుల కోసం ఒక్కొక్కటి 12 అంతస్థులతో నిర్మితమవుతున్న 61 టవర్లను చూపిస్తారు. ఐఏఎస్ అధికారుల కోసం సిద్ధమైన మోడల్ ఫ్లాట్‌ను చూపిస్తారు. మంత్రులు, ఉన్నతాధికారులు, న్యాయమూర్తుల కోసం నిర్మిస్తున్న బంగళాలను చూపుతారు.
ఆ తర్వాత 5 భారీ ఆకాశహర్మ్యాల సముదాయంగా నిర్మితమవుతున్న సెక్రటేరియట్ టవర్లను, మొనదేలిన సూది ఆకారంలో రూపుదాల్చనున్న అసెంబ్లీ నిర్మాణ స్థలాన్ని, బౌద్ధస్థూపాన్ని తలపించేలా నిర్మితమయ్యే హైకోర్టు ప్రదేశాన్ని, శాశ్వత భవనం సిద్ధమయ్యేవరకు హైకోర్టు నిర్వహణకు వీలుగా చేపట్టి.. ప్రస్తుతం తుదిమెరుగులు దిద్దుకుంటున్న జ్యుడీషియల్ కాంప్లెక్స్ భవంతిని సందర్శకులు తిలకిస్తారు.
అనంతరం గతేడాది నుంచే తరగతులను నిర్వహిస్తూ వేలాది మంది విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యనందిస్తున్న ఎస్‌ఆర్‌ఎం, విట్ అమరావతి విశ్వవిద్యాలయాల క్యాంపస్‌లను చూస్తారు.
అక్కడి నుంచి వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయ సముదాయం మీదుగా సీడ్ యాక్సెస్ రోడ్డు చేరుకునే సందర్శకులకు వాటి విశిష్టతలను అధికారులు తెలియజేస్తారు. చివరిగా రాజధానికి వరదముప్పును తప్పించేందుకు ఉండవల్లి వద్ద నిర్మించిన కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం చూపిస్తారు. తర్వాత సందర్శకులకు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మవారి దర్శనం కల్పించడంతో అమరావతి యాత్రలు ముగుస్తాయి.
