అమరవీరులకు నివాళులర్పించిన యువత

Published: Saturday January 27, 2018

విజయవాడ‌: స్వాతంత్య్ర సముపార్జన కోసం ప్రాణార్పణ చేసిన అమరవీరులకు నగర యువత వినూత్నంగా నివాళులర్పించింది. శుక్రవారం 69వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వివేకానంద యూత్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యాన 69 రకాల సామాజిక రుగ్మతలపై ప్రజల్లో చైతన్యం వచ్చేలా 69 సైకిళ్లతో సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. స్వాతంత్య్ర సమరయోధుల భవనం వద్ద అమరవీరులకు నివాళులర్పించి ఎంజీ రోడ్డు, ఆటోనగర్‌ గేట్‌, గురునానక్‌ కాలనీ, పీబీ సిద్ధార్థ కళాశాల, శిఖామణి కూడలి మీదుగా ర్యాలీ నిర్వహించారు. కూడళ్లలో సామాజిక రుగ్మతలపై అవగాహన కల్పించారు. సైకిల్‌ ర్యాలీని పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్‌ కళాశాల అధ్యక్షుడు చలువాది మల్లిఖార్జునరావు, జిల్లా సీనియర్‌ సిటిజన్స్‌ సంఘం కార్యదర్శి మోతుకూరి వెంకటేశ్వరరావులు ప్రారంభించారు. కార్యక్రమంలో వివేకానంద యూత్‌ ఆర్గనైజేషన్‌ అధ్యక్షుడు వైట్ల కృష్ణప్రసన్న, స్వాతంత్య్ర సమరయోధులు ఎర్నేని నాగేశ్వరారవు, గద్దె సత్యనారాయణ, సీనియర్‌ సిటజన్స్‌, వివేకానంద యూత్‌ ఆర్గనైజేషన్‌ సభ్యులు పాల్గొన్నారు.