అమరావతిలో భారీ ఎన్టీఆర్ విగ్రహం..
Published: Thursday December 13, 2018

తెలుగువారి గుండెచప్పుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మెమోరియల్‌ను అద్భుతంగా నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అమరావతిలోని నీరుకొండపై ఏర్పాటు చేయనున్న ఎన్టీఆర్ మెమోరియల్ ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం పరిశీలించారు. ఎల్‌అండ్‌టీకి చెందిన డిజైన్స్ అసోసియేట్స్ రూపొందించిన ఆకృతులను చూశారు. 32 మీటర్ల ఎత్తయిన అన్నగారి భారీ విగ్రహాన్ని ఏర్పా టు చేయాలని ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టుకు రూ.406 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. విగ్రహ నిర్మాణానికే రూ.155 కోట్లు అవసరమని తేల్చారు. 10వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే మెమోరియల్‌కు మరో రూ.112.50 కోట్లు కావాలని అధికారులు తెలిపారు. ఈ మొత్తం లో చాలా వరకూ విరాళాల రూపంలో సేకరించాలని భావిస్తున్న ప్రభుత్వం.. ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది.
ప్రస్తుతం గుజరాత్‌లో పటేల్ విగ్రహమే ఎత్తయినది, దీనిని ముంబైలో ఏర్పాటు చేసే ఛత్రపతి శివాజీ విగ్రహం అధిగమిస్తుందని అధికారులు తెలిపారు. అయితే కొండపై ఏర్పాటు చేస్తున్న ఎన్టీఆర్ మెమోరియల్ ప్రాజెక్టు వాటికి మించిన ప్రత్యేకతతో ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ విగ్రహం లోపల అమ ర్చే లిఫ్ట్‌ల ద్వారా సందర్శకులు పైవరకూ వెళ్లి, అక్క డ నుంచి రాజధానిని వీక్షించవచ్చన్నారు. విగ్రహం లోపలే ఎన్టీఆర్ మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. చుట్టూ వాటర్‌ఫ్రంట్, ఆడిటోరియం, ఫెర్రీ, సెల్ఫీ పాయింట్, కేఫ్, యాంఫీ థియేటర్, మినీ ట్రైన్లతోపాటు స్టార్ హోటల్, షాపింగ్ సెంటర్లు, రెస్టారెంట్లు, రిసార్టులను కూడా నెలకొల్పుతామని తెలిపారు. 46 నెలల్లోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎంకు చెప్పారు.
