ఏపీ ప్రజలు సంతోషంగా ఉన్నారు : గవర్నర్ నరసింహన్

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా... ఏపీ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. విభజన కష్టాలను ఏపీ ఎదుర్కోందన్నారు. ఏపీ ప్రజలకు గవర్నర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహనీయుల త్యాగ ఫలితంగా... ఇవాళ ఈ వేడుకలు జరుపుకుంటున్నామని వ్యాఖ్యానించారు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకొని, అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్నామన్నారు. ఏపీలో 85శాతం మంది ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఏపీ ప్రభుత్వం వేగంగా అభివృద్ధి చెందుతోందని కితాబిచ్చారు. త్వరలోనే చంద్రన్న విలేజ్ మాల్స్ ప్రారంభం కానున్నాయని గవర్నర్ తెలిపారు.
‘‘కాపులకు 5శాతం రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో తీర్మానం చేశాం. బీసీలకు నష్టం కలగకుండా కాపులకు రిజర్వేషన్లు. బీసీ విద్యార్థుల విదేశీ విద్య కోసం రూ.10లక్షలు ఇస్తున్నాం. బీసీ సబ్‌ప్లాన్ నిధులు పెంచుతున్నాం. వాల్మికి, బోయలను ఎస్టీల్లో చేర్చాలని కేంద్రాన్ని కోరతాం. ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు 75 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. పట్టిసీమతో కృష్ణా-గోదావరి నదులను అనుసంధానించాం’’ అని గవర్నర్ వివరించారు.
